అంటార్కిటికాలో ఫ్రాన్స్ దేశం అంత మంచు పలక అదృశ్యం!

  • అంటార్కిటిక్ ద్వీపకల్పంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు
  • హిమానీనదాలకు రక్షణగా ఉండే మంచు లేకపోవడంతో పెరిగిన ప్రమాదం
  • పెంగ్విన్‌లు, ఇతర సముద్ర జీవుల మనుగడకు ముప్పుగా మారిన పరిణామం
అంటార్కిటికాలో అత్యంత ఆందోళనకరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పశ్చిమ అంటార్కిటికా తీరంలోని బెల్లింగ్‌షౌసెన్ సముద్రంలో ఫ్రాన్స్ దేశమంత విస్తీర్ణంలో ఉండాల్సిన సముద్రపు మంచు కనుమరుగైంది. శీతాకాలంలో గడ్డకట్టాల్సిన సుమారు 6.50 లక్షల చదరపు కిలోమీటర్ల మేర ప్రాంతం మంచు లేకుండా ఖాళీగా ఉండటాన్ని శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే సమయంలో అంటార్కిటిక్ ద్వీపకల్పంలో అసాధారణ రీతిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

అర్జెంటీనాకు చెందిన ఎస్పెరాంజా పరిశోధన కేంద్రంలో జూన్ 5వ తేదీన 15.4 డిగ్రీల సెల్సియస్, జూన్ 6వ తేదీన 13.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంగా ఈ కాలంలో అక్కడ మైనస్ 6.2 డిగ్రీలు సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండాలి. అంటే సగటు కంటే ఏకంగా 20 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్టు స్పష్టమవుతోంది. ఈ పరిస్థితి అత్యంత తీవ్రమైనదని, గత నాలుగేళ్లలో ఇలా జరగడం ఇది మూడోసారని టాస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన అంటార్కిటిక్ నిపుణుడు డాక్టర్ విల్ హాబ్స్ వెల్లడించారు. ఇది ప్రకృతిలో వస్తున్న శాశ్వత మార్పులకు సంకేతమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ మంచు ఫలకం త్వైట్స్, పైన్ ఐలాండ్ వంటి కీలకమైన హిమానీనదాలకు (గ్లేసియర్స్) రక్షణ కవచంలా పనిచేస్తుంది. సముద్రపు మంచు కరగడం వల్ల నేరుగా సముద్ర మట్టాలు పెరగకపోయినప్పటికీ పరోక్ష ప్రభావం ఉంటుంది. ఈ మంచు ఫలకం లేకపోవడం వల్ల సముద్రపు అలల తాకిడికి హిమానీనదాలు వేగంగా కరిగి, తద్వారా ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు పెరిగే ప్రమాదం ఉంది.

ఈ పరిణామం అక్కడి జీవవైవిధ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. సముద్రపు మంచుపై పెరిగే నాచు, క్రిల్ వంటి సూక్ష్మ జీవులకు ప్రధాన ఆహారం. ఈ క్రిల్‌ పైనే పెంగ్విన్‌లు, సీల్స్, తిమింగలాలు ఆధారపడి జీవిస్తాయి. మంచు కరగడం వల్ల ఆహార వ్యవస్థ దెబ్బతింటోంది. 2022లో కూడా మంచు ముందస్తుగా కరిగిపోవడంతో వేలాది ఎంపరర్ పెంగ్విన్ పిల్లలు మృత్యువాత పడ్డాయి. ఈ తాజా మార్పులు తాత్కాలికమా లేదా భవిష్యత్తులో సంభవించబోయే పెనుమార్పులకు సంకేతమా అనే కోణంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు ముమ్మరం చేశారు.

Antarctica
Sea ice loss
Climate change
Bellingshausen Sea
Global warming
Emperor penguins

More Telugu News